
అయ్యన్నపేట, 04 జూలై (హి.స.)
: సామాజిక మాధ్యమాల వేదికగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై విజయనగరంలో జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన నేత గురాన రాధిక నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ విమర్శల పరిధి దాటి, వ్యక్తిగత దూషణలకు దిగడం చట్టరీత్యా నేరమన్నారు. ముఖ్యంగా మహిళా నాయకులను, పార్టీ అధినేతను లక్ష్యంగా చేసుకుని ‘ప్రశ్న రావణ్’ చేసిన వ్యాఖ్యలు సమాజానికి చెడు సంకేతాలు పంపుతున్నాయని, ఇలాంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
బాధిత మహిళలకు అండగా నిలవాలి.
అయ్యన్నపేట: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కె.వి. బాలమణి శనివారం జిల్లా వన్ స్టాప్ సెంటర్ను సందర్శించారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, సేవల అమలు, నిర్వహణ విధానం, నమోదు పుస్తకాలలోని వివరాలను సరిపోల్చారు. అనంతరం సిబ్బందితో సమావేశమై, కేంద్రం ద్వారా బాధితులకు అందుతున్న సేవలపై చర్చించారు. విధుల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఆరా తీశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సేవలను సమర్థవంతంగా అందించాలన్నారు. బాధిత మహిళలకు భరోసా కల్పించేలా ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ