
హైదరాబాద్, 04 జూలై (హి.స.)
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య
సేవలు అందించడానికి శాయ శక్తుల కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలకు ఎలాంటి రాజీ పడకుండా నిర్ణీత గడువులో నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే మల్లాపూర్, నాచారం, కాప్రా, హబ్సిగూడ, చర్లపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు సమీపంలోనే లభిస్తాయని తెలిపారు. దీంతో వైద్య అవసరాల కోసం నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో చికిత్స అందే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆధునిక వైద్య సదుపాయాలతో ఆస్పత్రిని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు