
వేములవాడ, 04 జూలై (హి.స.)
వేములవాడ నియోజకవర్గంలో
ఏర్పాటుకానున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ ప్రాంతానికి మణిహారంగా మారబోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటులో భాగంగా చందుర్తి మండలం మూడపల్లి గ్రామ శివారులో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన సముదాయలకు శనివారం జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకొని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని, ఈ తరుణంలోనే ఆయన ప్రత్యేక శ్రద్ధతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఈ నిర్మాణాలతో హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు మించి ఇక్కడి విద్యార్థులకు విద్యతో పాటు మంచి వసతి, భోజన సదుపాయం కలుగుతుందని, ఇందులో చదువుకున్న విద్యార్థులు రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో మరో హైస్కూల్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను గెలిచిన వెంటనే గత పాలకుల నిర్లక్ష్యంతో అన్ని రంగాల్లో వెనుకబడిన వేములవాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నానని, గతంలో పడావుపడిన ప్రాజెక్టులనన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. చందుర్తి- మోత్కురావుపేట రూ.17 కోట్లతో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
రాబోయే 15 నెలల కాలంలో రాజన్న ఆలయాన్ని, ఇప్పుడు నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండు ఒకేసారి ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ రెండు కార్యక్రమాలతో అటు రాజన్న భక్తులకు, ఇటు నియోజకవర్గంలోని విద్యార్థిని, విద్యార్థులకు మేలు చేసినట్లు అవుతుందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ మాట్లాడుతూ... సుమారు 20 ఎకరాల్లో, రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో ఈ ప్రాంతంలోని సుమారు 3000 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉందని, రాబోయే 18నెలల కాలంలో పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేసి సాధ్యంవంతమైన త్వరగా అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎంతో ఉపయోగపడనున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..