
ముంబై, 08 జూలై (హి.స.) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా సుదీర్ఘకాలం అలరించిన చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లై, ఓ బిడ్డకు తల్లి అయ్యాక తన సెకండ్ ఇన్నింగ్స్ను చాలా ప్లాన్డ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. కమర్షియల్ హంగామా కంటే వైవిధ్యమైన, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే ఆమె ఇప్పుడు ఓటు వేస్తున్నారు. తాజాగా కాజల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ సినిమా జూలై 24న విడుదలకు సిద్ధమవుతుండగా, బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’ కూడా లైనప్లో ఉంది. ఈ నేపథ్యంలో ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్స్లో పాల్గొన్న కాజల్.. తల్లిగా తనలో వచ్చిన మార్పులు, కొడుకు నీల్ కిష్టమైన విషయాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొడుకు నీల్ పుట్టిన తర్వాత ఒక నటిగా తన ఆలోచనా విధానం, బాధ్యత పూర్తిగా మారిపోయాయని కాజల్ వెల్లడించారు. ఇప్పుడు నా ముందుకు ఏ కథ వచ్చినా.. నా కొడుకు నీల్ కోణంలోనే ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో వాడు పెద్దయ్యాక మా అమ్మ చాలా మంచి సినిమాలు చేసింది అని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని కాజల్ చెప్పుకొచ్చారు.
టాలెంటెడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో కాజల్ అగర్వాల్ మండోదరి పాత్ర పోషిస్తున్నారు. ఈ విశేషాన్ని పంచుకుంటూ.. ఇంట్లో నీల్కు రామాయణం కథలన్నా, రామలీలా చూడాలన్నా చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను మండోదరి పాత్ర చేస్తున్నానని చెప్పగానే వాడు ఎగిరి గంతేసాడు. చిత్రమేంటంటే.. వాడికి అన్ని పాత్రల కంటే రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టం. ఈ సినిమా రెండో భాగం థియేటర్లలోకి వచ్చేసరికి నీల్కు ఐదేళ్లు వస్తాయి. థియేటర్లో వాడు చూడబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది అంటూ ఒక తల్లిగా మురిసిపోయారు కాజల్.
శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలో, కాజల్ కీలక పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ సినిమా సమాజంలో జరుగుతున్న ఒక సున్నితమైన అంశంపై తెరకెక్కింది. దీనిపై కాజల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కల్తీ ఆహారం, విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతున్నాయనే పాయింట్ను అద్భుతంగా చూపించారు. ఈ కథ విన్నాక నేనే స్వయంగా దీనిపై రీసెర్చ్ చేశాను. నా వంటగదిలో ఏ వస్తువులు ఉంచాలి, నా కొడుకు నీల్కు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు అనే విషయాలపై కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాను అని తెలిపారు.
ఒకవైపు కొడుకు బాధ్యతలను చూసుకుంటూనే, మరోవైపు సమాజానికి మేలు చేసే సందేశాత్మక చిత్రాలు, చరిత్రలో నిలిచిపోయే పౌరాణిక పాత్రలతో కాజల్ ముందుకు సాగుతుండటం చూసి నెటిజన్లు, ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చందమామ సెకండ్ ఇన్నింగ్స్ మరింత గ్రాండ్గా సాగాలని ఆకాంక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV