
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
నేడు తన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు తక్కువ ఖర్చుతో బసవతారకం ఆస్పత్రి ద్వారా ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నామని అన్నారు. తమ తల్లి ఆశయంతో ఈ సంస్థ నడుస్తోందని అన్నారు. త్వరలో హైదరాబాద్ లో నార్త్ బ్లాక్ విస్తరణ చేపట్టనున్నట్టు చెప్పారు. అదేవిధంగా అమరావతి పరిధిలోని తుళ్లూరులో రూ.650కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త ఆస్పత్రి మొదటి ఫేజ్ 2028 నాటికి పూర్తి అవుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో తనకు వయస్సు అనేది కేవలం నంబర్ మాత్రమేనని చెప్పారు. ఎవరైనా తనను అంకుల్ లేదా తాత అని పిలిస్తే వారి పని అంతే అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. పనికి వయసుతో సంబంధం లేదని ఏది ఏమైనా పనిచేసుకుంటూ వెళ్లడమేనని అన్నారు. భగవంతుడితో పాటు మన చేతుల్లో కూడా మన భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..