
ముంబై, 09 జూలై (హి.స.)మహారాష్ట్రలోని మరాఠ్వాడ (Marathwada) ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు సంభవించాయి. రాష్ట్రంలోని నాందేడ్, హింగోలి, పర్భణీ జిల్లాల్లో ఒకేసారి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అధికారుల సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున సరిగ్గా 4.40 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. హింగోలి జిల్లాలోని జామ్గిరి (Jamgiri) గ్రామం సమీపంలో భూ అంతర్భాగంలో 10 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు.
10 నిమిషాల వ్యవధిలోనే మరోసారి..
అర్ధరాత్రి దాటాకా మొదటి భూకంపం 1.29 గంటల సమయంలో రాగా, తెల్లవారుజామున 4.50 గంటల సమయంలో మరో చోట భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే, రిక్టర్ స్కేలుపై ఆ ప్రకంపనల తీవ్రత 3.6గా నమోదైది. నాందేడ్ నగరంతో పాటు జిల్లాలోని ముద్ఖేడ్, నాయిగావ్, బిలోలి, ఉమ్రి తదితర ప్రాంతాల్లో భూమి స్పష్టంగా కదలడంతో పాత్రలు, కిటికీలు శబ్దాలు చేశాయి. పర్భణీ జిల్లాలో కూడా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే,ఈ వరుస భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV