
భువనేశ్వర్, 09 జూలై (హి.స.)
: భారత ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొని, సముద్ర జలాల్లో స్థిరమైన మత్స్య సంపద పెంపకం, నిర్వహణ కోసం ఉద్దేశించిన 'లెటర్ ఆఫ్ ఆథరైజేషన్' (LoA) జాతీయ ఫ్రేమ్వర్క్ను అధికారికంగా ప్రారంభించారు. దీనితో పాటు ఒడిశా ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ (2026-2036)' డాక్యుమెంట్ను కూడా ఆయన ఆవిష్కరించారు.ఈ మైలురాయి లాంటి నిర్ణయం ద్వారా భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధి దాటి అంతర్జాతీయ జలాల్లో (High Seas) భారతీయ జెండాతో ప్రయాణించే పడవలు క్రమబద్ధీకరించబడిన, పారదర్శకమైన పద్ధతిలో చేపల వేట సాగించడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 10 ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (FPPOs), మత్స్యకారులకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా తొలి 'లెటర్ ఆఫ్ ఆథరైజేషన్' (LoA) పత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బ్లూ ఎకానమీ (Blue Economy) విజన్లో భాగంగా దేశీయ మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.ఒడిశా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (OUAT)లో జరిగిన ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, ఎస్.పి. సింగ్ బఘేల్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi