
కర్నూలు, 10 ఆగస్టు (హి.స.)ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్పై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, దక్షిణ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమవారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకటి, రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV