వైద్య.విద్యార్దిని. ప్రియాంక మృతి.కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు... సీఎం చంద్రబాబు ఆదేశం
వైద్య.విద్యార్దిని. ప్రియాంక మృతి.కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు... సీఎం చంద్రబాబు ఆదేశం
Chandrababu Naidu(file)


రాజమహేంద్రవరం, 11 ఆగస్టు (హి.స.)

: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రియాంక మృతి ఘటనను ప్రత్యేక కేసుగా పరిగణించి ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆమె తండ్రి వెంకటేశ్ కోరారని తెలిపారు. ఆయన ఆవేదనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజమహేంద్రవరంలో కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

ప్రియాంక మృతి ఘటన చాలా బాధాకరమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. నిందితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ కఠిన శిక్ష పడాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు. ఈ ఘటన వివరాలు తొలుత బయటకు ఎందుకు రాలేదో విచారిస్తామని చెప్పారు. తెదేపా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రెండు గంటల పాటు సమీక్షించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ప్రియాంక కుటుంబానికి రూ.10 లక్షల ఆస్పత్రి ఖర్చు, రూ.20లక్షల పరిహారం ప్రభుత్వం అందించిందన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కె నాగేంద్ర మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారన్నారు. నిందితులు తప్పించుకోకుండా పకడ్బందీ ఆధారాలు సేకరించారని చెప్పారు. కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande