
గురుగ్రామ్:, 11 ఆగస్టు (హి.స.)
హర్యానాలోని ప్రముఖ సైబర్ సిటీ మరియు ఐటీ హబ్ అయిన గురుగ్రామ్‌లో కొద్దిరోజులుగా కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, ఐటీ పార్కులు చెరువులను తలపిస్తుండటంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. ఈ మౌలిక సదుపాయాల వైఫల్యాలపై ప్రముఖ వ్యాఖ్యాత, రచయిత సుహేల్ సేథ్ నేడు సామాజిక మాధ్యమాల వేదికగా ఒక పౌర ప్రచారాన్ని (Citizens' Campaign) ప్రారంభించారు.
నగరంలో పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఈ ఉద్యమానికి బయోకాన్ అధినేత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్-షా పూర్తి మద్దతు ప్రకటించారు. కేవలం గురుగ్రామ్ మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, పౌరులందరూ ఏకమై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi