
తిరుమల, 11 ఆగస్టు (హి.స.) కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు (Devotees of Tirumala) భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు నిన్న ఒక్కరోజే మొత్తం 81,064 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారిలో 33,136 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.36 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా భక్తులు టీటీడీ సూచనలు పాటిస్తూ దర్శనానికి సహకరించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV