
నల్గొండ జిల్లా: , 12 ఆగస్టు (హి.స.)
నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నిన్న అర్ధరాత్రి సమయంలో చిన్నపాటి గండి పడింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈరోజు ఉదయం కల్లా గండి కాస్తా పెద్దదిగా మారి, కాల్వ నీరు పక్కనే ఉన్న వందలాది ఎకరాల పంట పొలాల్లోకి ముంచెత్తింది. తాజాగా సాగు చేసిన వరి నార్లు నీట మునగడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎడమ కాల్వకు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. గండి పడిన ప్రాంతాన్ని యుద్ధప్రాతిపదికన పూడ్చడానికి ఇసుక బస్తాలు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi