ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణ యువతను సిద్ధం చేస్తాం.. లెఫ్టినెంట్ జనరల్తో సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Revanthreddy


హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం తెలియజేశారు. ఆర్మీ నియామకాల్లో స్థానిక యువతకు భారీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆసక్తి చూపుతున్న, అనువైన జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ రిక్రూట్మెంట్లకు ముందు ఆయా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.

అలాగే, విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపైనా సీఎం చర్చించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణలో విపత్తు పరిస్థితుల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తామని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, చారిత్రక వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మూసీ నది పునరుజ్జీవనం అవసరమని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande