
అమరావతి, 12 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల పునర్నియామక (రీ-ఇండక్షన్) ప్రక్రియ మళ్లీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ కార్పొరేషన్లో 60 ఏళ్లకు పదవీ విరమణ చేసినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగేందుకు అర్హత ఉన్న ఉద్యోగులందరికీ పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే సర్వీసు పొడిగింపునకు అర్హత పొందిన అన్ని క్యాడర్లలోని రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులకు ఇప్పటికే ఇచ్చిన రీ పోస్టింగ్ ఆర్డర్లు సహా మొత్తం రీ-ఇండక్షన్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలంటూ గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి ఓఎస్డీ (ప్రత్యేకాధికారి) ఎన్.ప్రకాశరావు ఆ శాఖ కార్యదర్శి హెప్సిబాకు తాజాగా లేఖ రాశారు (ఈమె సోమవారమే బాధ్యతలు చేపట్టారు). ఈ అంశంపై మంత్రి సమీక్ష పూర్తయ్యేవరకు అన్ని క్యాడర్ల ఉద్యోగులు, అధికారుల రీపోస్టింగ్ల(పునర్నియామకాలు) నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం పునర్నియామక ఉత్తర్వులిచ్చి నెల దాటిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ