
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిన్న రాత్రి నుంచి భారీ ఎత్తున ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నియోజకవర్గ అభివృద్ధిని మరియు ప్రజా సమస్యలను కేటీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. నిరసనకారులు సిరిసిల్ల ముఖ్య కూడలిలో బైఠాయించి ప్రభుత్వానికి మద్దతుగా, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నా కారణంగా పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో సిరిసిల్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi