
అదిలాబాద్ జిల్లా: , 12 ఆగస్టు (హి.స.)
అదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ఐటీడీఏ (ITDA) గ్రామాల్లో వర్షాకాలపు అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జిల్లా ఆరోగ్య శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. నిన్న రాత్రి వైద్య అధికారులతో జరిగిన అత్యవసర సమావేశం అనంతరం, ఈరోజు ఉదయం నుంచి 12 ప్రత్యేక మొబైల్ మెడికల్ వ్యాన్లను ఏజెన్సీ ప్రాంతాలకు పంపించారు. ఈ వ్యాన్లు గిరిజన గూడెంలలోనే ఉంటూ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తాయి. బాధితులకు అవసరమైన మందులను అక్కడికక్కడే పంపిణీ చేస్తున్నారు. తాగునీటి శుద్ధీకరణ కోసం క్లోరినేషన్ ప్రక్రియను కూడా వైద్య సిబ్బంది స్థానికులకు వివరిస్తున్నారు. గిరిజన ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తక్షణమే ఈ మొబైల్ క్యాంపులను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi