
రేణిగుంట, 12 ఆగస్టు (హి.స.)తిరుపతి జిల్లా రేణిగుంటలో డీజీపీ ఆదేశాల మేరకు 1,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ప్రారంభించిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర.
డీజీపీ ఆదేశాలతో రేణిగుంటలో వెయ్యి మొక్కల నాటకం.. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా రేణిగుంట మండల పరిధిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు బుధవారం రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు భావితరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, నాటిన మొక్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
విద్యార్థులు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తన ఇంటి పరిసరాల్లో కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం సాధ్యమవుతుందని తెలిపారు. రేణిగుంట మండలంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో హరిత కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. నాటిన మొక్కల సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ జయచంద్ర, ఎస్సై శ్రీనివాసులు, రైటర్ చలపతి, పాఠశాల హెచ్ఎం శ్యామల, ఎంఈఓ రంగనాథం, డీవైఈఓ ఇందిరాదేవి, పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV