
హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ నగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపట్టింది. వర్షాకాలం నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలను తీవ్రతరం చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్ యొక్క మొదటి రోజే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 97 మెట్రిక్ టన్నుల చెత్త మరియు వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. నాలాల పూడికతీత, నిల్వ ఉన్న నీటి తొలగింపు, రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాల రవాణా వంటి పనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్ మరియు యాంటీ లార్వా ద్రావణాల స్ప్రేయింగ్ పనులను కాలనీల్లో ముమ్మరం చేశారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అధికారులు కోరారు. నగర పారిశుద్ధ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారుల బృందాలను రంగంలోకి దించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేసే వ్యాపార సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi