
విజయనగరం, 13 ఆగస్టు (హి.స.)
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా కేంద్రంలో ఆర్డీవో సనపాల సుధాసాగర్ ఆధ్వర్యంలో గురువారం ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆదేశాలు, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్థానిక అంబేడ్కర్ జంక్షన్ నుంచి మయూరి కూడలి వరకు ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం సుధాసాగర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. దేశ పౌరులుగా మన బాధ్యతను గుర్తు చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో ఉద్యోగులతోపాటు విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ