
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్న పురస్కరించుకుని అమెరికాలోని ప్రముఖ రాష్ట్రాలైన డెలావేర్, న్యూయార్క్, న్యూజెర్సీలు ఆగస్టు 15ను 'ఇండియా డే'గా అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామ ప్రాముఖ్యతతో పాటు అమెరికా సామాజిక, ఆర్థిక వికాసంలో భారతీయ-అమెరికన్ల భాగస్వామ్యాన్ని, వారి పాత్రను స్మరించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా రాష్ట్రాల గవర్నర్లు తెలిపారు.
డెలావేర్ గవర్నర్ మాథ్యూ మేయర్ ఈ మేరకు ప్రత్యేక ప్రకటనను విడుదల చేస్తూ.. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న భారతీయ-అమెరికన్ సమాజం వారి సంస్కృతి, సేవలు, ప్రావీణ్యంతో డెలావేర్ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతోందని కొనియాడారు. న్యూజెర్సీ గవర్నర్ మైకీ షెరిల్, న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ కూడా తమ రాష్ట్రాల్లో ఆగస్టు 15ను 'ఇండియా ఇండిపెండెన్స్ డే'గా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, సాంకేతికత, వ్యాపారం, ప్రజాసేవ రంగాల్లో భారతీయుల కాలానుగుణ కృషిని, భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న ప్రజాస్వామ్య బంధాన్ని ఈ ప్రకటనలు ప్రతిబింబిస్తున్నాయని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వందేమాతరం 150 ఏళ్ల వేడుకలతో పాటు యువశక్తి ప్రధాన ఇతివృత్తంగా జరుపుకోనుంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల నేతృత్వంలో జాతీయ జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా న్యూయార్క్ ని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, సీటెల్లోని స్పేస్ నీడిల్ వంటి ప్రసిద్ధ నిర్మాణాలను మువ్వన్నెల కాంతులతో అలంకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు