పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ.. ఆసిఫాబాద్ ఎస్పీ
పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ.. ఆసిఫాబాద్ ఎస్పీ
Sp


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, ప్రత్యేక రక్షణ దళం, అగ్నిమాపక, జైళ్ల శాఖ తదితర విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా యువతకు ఉచిత పోలీసు ఉద్యోగ శిక్షణ అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నిఖితా పంత్ తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 139 పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ 87, ఏఆర్ కానిస్టేబుల్ 40, ఫైర్ఫైటర్ 9, జైళ్ల శాఖలో వార్డర్ 3 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.

పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, శారీరక శిక్షణ నిపుణులతో తరగతి బోధనతో పాటు శారీరక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతీ యువకులు తమ సమీప పోలీస్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఆగస్టు 15న ప్రవేశ పరీక్ష..

ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక కోసం ఆగస్టు 15న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల ఉచిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభ తేదీ, స్థలం, ఇతర పూర్తి వివరాలు అనంతరం తెలియజేస్తామని తెలిపారు. పేద, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలకు చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగం సాధించేందుకు కష్టపడి శ్రమించాలని ఎస్పీ నిఖితా పంత్ కోరారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం పట్ల కుమురం భీమ్ జిల్లాలోని యువతీ యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande