
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)
పేరుతో ఓటర్లను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) దృష్టికి వచ్చింది. ఓటర్ల గుర్తింపు కార్డులు, ఎన్యూమరేషన్ ఫారమ్లలో వివరాలు సరిపోలడం లేదని, అందువల్ల ఫారమ్లు తిరస్కరించబడ్డాయని పేర్కొంటూ పలువురికి మోసపూరిత సందేశాలు (Fake Messages) వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు మెసేజ్లలో ఒక నిర్ధిష్ట నంబర్కు కాల్ చేయాలని లేదా వాట్సప్ ద్వారా పంపిన లింక్ను ఓపెన్ చేసి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా రూ.5 చెల్లించి ఫారమ్ను మళ్లీ నింపాలని కోరుతున్నారు. ఈ ప్రక్రియలో బ్యాంకింగ్ లాగిన్ వివరాలు, పాస్వర్డ్లు, కార్డ్ సీవీవీ (CVV) నంబర్, ఏటీఎం పిన్ వంటి అత్యంత రహస్యమైన వివరాలను సేకరిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఎన్నికల సంఘం స్పష్టత
భారత ఎన్నికల కమిషన్ (ECI) లేదా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎలాంటి రుసుములు వసూలు చేసేందుకు లేదా వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు కోరేందుకు ఇటువంటి సందేశాలను, లింక్లను పంపదని సీఈఓ కార్యాలయం స్పష్టం చేసింది. ECI లేదా CEO పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలు, కాల్స్ పట్ల ఓటర్లు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, ఎలాంటి స్పందనా ఇవ్వవద్దని సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి సందేశాలు లేదా కాల్స్ వస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో గానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో గానీ ఫిర్యాదు చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..