
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
మల్కాజిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని సీపీ సుమతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న సీపీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ సుమతి మొక్కలు నాటారు. ఆ తర్వాత ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్తో కలిసి మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్తో సమీక్ష నిర్వహించారు. ఏసీపీ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, సిబ్బంది వివరాలు, పోలీస్ స్టేషన్లలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ఆయా కేసుల దర్యాప్తు ఏ దశలో ఉంది, పెండింగ్లో ఉన్న కేసుల పరిస్థితి, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
అలాగే ఏసీపీ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు అందుతున్న సేవలు, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యల పై కూడా సీపీ వివరాలు తెలుసుకున్నారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.కాగా సీపీ సుమతి తనిఖీ సందర్భంగా పోలీస్ స్టేషన్లోనే కొనసాగుతున్నారు. అనంతరం ఏసీపీ పరిధిలోని పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి విధులు, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు