
అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
అప్పన్నస్వామి దర్శనానికి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఆహారం అందిస్తున్న నిత్య అన్నప్రసాద పథకం శుక్రవారంతో 37 ఏళ్లు పూర్తిచేసుకుని 38వ వసంతంలోకి అడుగు పెడుతోంది. పూర్వీకులు సింహగిరిపై ‘అన్నగిరి’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. సింహగిరికి వచ్చిన ఏ ఒక్కరూ ఆకలితో వెళ్లేవారు కాదని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న క్షేత్రంలో 1989 ఆగస్టు 14న సింహాచలం దేవస్థానం పోగేసిన రూ.50 వేల విరాళాల సొమ్ముతో భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. దాతలకు కల్పించే సదుపాయాలను ఈవో జల్లేపల్లి వెంకటరావు వివరించారు.
రూ.లక్ష పైబడి విరాళాల దాతలకు దేవస్థానం ధ్రువపత్రం, ఫొటో గుర్తింపు కార్డు జారీ చేస్తారు. కుటుంబ సమేతంగా దర్శనం కల్పించి శేష మాలతో సత్కరించి వేదాశీర్వచనం అందిస్తారు. 400 గ్రాముల కల్యాణం లడ్డూ ఒకటి, 80 గ్రాముల లడ్డూలు నాలుగు, ఆరు పులిహోర పొట్లాలు ప్రసాదంగా అందిస్తారు. ఏడాదికొకసారి స్వామిని దర్శించుకోవచ్చు. దాత కోరిన తేదీన వారి గోత్రనామాలతో భక్తులకు అన్నదానం చేస్తారు. ఆ వివరాలు బోర్డుపై ప్రదర్శిస్తారు. రూ.5 లక్షల పైబడి విరాళమిచ్చిన వారికి ఈ సదుపాయాలతో పాటు దాతల కోరితే చందనోత్సవం రోజున రెండు రూ.వెయ్యి టికెట్లు అందిస్తారు. రూ.10 వేల నుంచి రూ.లక్షలోపు దాతలకు ఏడాదిలో ఒకరోజు వారు కోరిన తేదీన దాత పేరిట అన్నప్రసాదం వితరణ చేస్తారు. విరాళం సమర్పించిన రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు.
అన్నప్రసాద వితరణ ఇలా..
సాధారణ రోజుల్లో 3 వేల మంది, శనివారం 5,500, ఆదివారం 4,500 మందికి అన్నప్రసాదం అందిస్తారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు 200 మందికి కదంబం ప్రసాదం వితరణ చేస్తారు. శనివారం 500 నుంచి వెయ్యి మందికి అందిస్తారు.ఒక ప్లేటు భోజనానికి రూ.41 ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం అన్నప్రసాదం విభాగం డిజిపాట్లు రూ.43.21కోట్లు ఉండగా, డిపాజిట్లపై 2025-26 ఏడాదికి వచ్చిన ఆదాయం రూ.2.14 కోట్లుగా ఉంది.
---------------
[
.+'l
+
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ