
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే
నం.83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని TGIIC వేలం వేయడాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి.. నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారు? ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటనా? అని మండిపడ్డారు. ఈ మేరకు ఈ భూములను వేయడానికి సిద్ధం కావడం తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న TGIIC వేలాలను వెంటనే నిలిపివేయాలని BRS పక్షాన డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి.. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన నువ్వు.. నేడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ, ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నేడు రాయదుర్గ్ ఇలా ఎక్కడిక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటున్నారు. రాయదుర్గ్ లోని సర్వే నం.83ను హెరిటేజ్ సైట్గా గుర్తించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం.. వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోంది? మీ అనుయాయులకు మేలు చేసేందుకేనా? అని నిలదీశారు. ఇదే సర్వే నంబర్ లో గతంలో 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే, ఎస్బిఐ కోర్టుకు ఎక్కింది. కోర్టు అంక్షితలు వేసింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. అయినా అదే సర్వే నంబర్లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? న్యాయ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? అని ప్రశ్నించారు.
సీఎంవా? రియల్ ఎస్టేట్ ఏజెంట్వా?:
సర్వే నం.83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వర్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నామన్నారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మాలని చూడటం దారుణం అని రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలన్నారు. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండండి. లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు