
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి చిన్న వయసులోనే సినీ రంగంలో తనదైన ముద్ర వేసి ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు. 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా అరంగేట్రం చేసిన ఆమె, తన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆ చిత్రంలో అత్యుత్తమ నటనకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నటనతో పాటు సింగర్గా కూడా రాణిస్తున్న ఆమె, ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్లో ప్రధాన సింగర్గా వ్యవహరించి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా సుకృతి వేణి అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
అమెరికాలోని బోస్టన్ నగరంలొ ఉన్న జగద్విఖ్యాత 'బర్క్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్'లో ప్రదర్శించిన ప్రతిభకు గానూ ఆమెను 'ఎన్సెంబల్ ఎక్సెలన్స్ అవార్డు' దక్కింది. అంతేకాకుండా ఆ ప్రసిద్ధ విద్యాసంస్థలో ఉచితంగా చదువుకునేందుకు వీలుగా ఫుల్ స్కాలర్షిప్ సాధించారు. ఈ అత్యంత పోటీతో కూడిన స్కాలర్షిప్ ఆడిషన్స ప్రపంచ నలుమూలల నుంచి మొత్తం 272 మంది విద్యార్థులు పోటీ పడగా, చివరికి కేవలం 14 మంది మాత్రమే పూర్తి స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. విశేషమేమిటంటే, ఈ విభాగంలో సింగర్స్ కేటగిరీ నుంచి ఫుల్ స్కాలర్షిప్ పొందిన ఏకైక విద్యార్థిగా సుకృతి నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. తండ్రికి తగ్గ తనయగా అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిని చాటుతున్న సుకృతి వేణిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు