విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్ చిత్ర మిశ్రా
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్ చిత్ర మిశ్రా
కలెక్టర్


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ధన్గర్వాడీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. భవిత కేంద్రంలో గదులను పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. పిల్లలు, సిబ్బంది వివరాలతో పాటు చిన్నారులకు అందిస్తున్న ఆహారం, ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. జిల్లాలోని 16 భవిత కేంద్రాల్లో తాగునీటి వసతి కోసం వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు యూనిఫామ్లు, పుస్తకాలు అందించాలని అధికారులకు సూచించారు.

భవిత కేంద్రాల్లో పేరెంట్స్ వెయిటింగ్ రూమ్, ప్రత్యేక వాష్రూమ్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి భవిత కేంద్రంలో సరిపడా సిబ్బంది, అంటే సమ్మిళిత విద్యా బోధకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్, బెంచీలను చూసి కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వాటిని అవసరమైన విధంగా మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్, బెంచీలను అవసరమైన పాఠశాలలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు నేలపై కూర్చోకుండా ప్రతి పాఠశాలలో విధిగా బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న స్క్రాప్ను తొలగించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande