
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
ఉత్తరాఖండ్లోని రామ్జీలా మైదాన్లో తాను పాల్గొన్న స్టేజ్ను బీజేపీ శుద్ధి చేసిన అంశాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించారు. ఆ మైదానంలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఖర్గే ప్రసంగించారు. అయితే ఆయన వెళ్లిన తర్వాత అక్కడ స్టేజ్ను శుద్ది చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తూ.. అంటరానితనం చట్టం కింద వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హల్దీవానిలో స్టేజ్ను శుద్దీకరించిన వారిని శిక్షించాలన్నారు. వాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా ఆ చర్యను ఖండించారని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఖర్గే మాట్లాడుతున్న సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. ఇలాంటి కార్యక్రమాలను బీజేపీ ప్రోత్సహించదు అని, ఆ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతామని మంత్రి జేపీ నడ్డా అన్నారు.
హల్ద్వానీలో తాను ప్రసంగం చేసిన స్టేజ్ను బీజేపీ సంబంధిత వ్యక్తులు శుద్ది చేశారని ఖర్గే తన ప్రసంగంలో ఆరోపించారు. ఆ సభలో తాను కేవలం ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడానని, తానేమీ మతం గురించి కానీ, ఇతర అంశాల గురించి కానీ మాట్లాడలేదన్నారు. ఆ సభా ప్రాంగణంలో హవనం, శుద్ది ప్రక్రియ నిర్వహించారని, ప్రజాస్వామ్యం ఇలాగే పనిచేస్తుందా, రాజ్యాంగాన్ని మీరు రక్షిస్తున్నారాన అని ఖర్గే ప్రశ్నించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయదలుచుకోలేదని, స్టేజ్ను శుద్ధి చేసి తనను అవమానించారని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..