
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
గురువారంతో ముగిశాయి. మొత్తం 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల ముగింపు సందర్భంగా లోక్సభ, రాజ్యసభలు 'వందేమాతరం' గీతాలాపన అనంతరం నిరవధికంగా (Sine Die) వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల కాలంలో పార్లమెంట్ ఉభయ సభలు మొత్తం 12 కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. తదుపరి సమావేశాల్లో సభ్యులు మరింత మెరుగ్గా పనిచేసి ప్రజాసమస్యలపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్ పిలుపునిచ్చారు.
సమావేశాల చివరి రోజున ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్యే రాజ్యసభ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు - 2026'ను ఆమోదించింది. అంతకుముందు రోజు (బుధవారం) లోక్సభ ఆమోదించిన ఈ బిల్లుపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చర్చకు సమాధానమిచ్చారు. కేంద్రం విచారణాధికారాలు లేదా నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజ హక్కులు, భూములపై పన్నులు, సెస్సులు విధించేలా ఈ బిల్లు పరిమితులు విధిస్తుందన్నారు.
మరోవైపు లోక్సభలో ప్రతిపక్షాల నిరసనలు మిన్నంటాయి. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలోకి రాగానే.. క్షమాపణ చెప్పాలి, లాఠీఛార్జ్లకు ఆదేశించింది ఎవరు? అని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. అధికార పక్ష ఎంపీలు సైతం నినాదాలు చేయగా, అమిత్ షా వారిని శాంతించి సీట్లలో కూర్చోవాలని సైగ చేయడంతో ఎన్డీయే ఎంపీలు మౌనంగా కూర్చున్నారు. ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభకు చేరుకున్నారు. అనంతరం వందేమాతర గీతాన్ని ఆలపించగా.. స్పీకర్ లోక్సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు