
కర్నూలు, 13 ఆగస్టు (హి.స.) ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అవయవ దానం అనేది కరుణ, మానవత్వం, సామాజిక బాధ్యతల సమాహారమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అవయవాలను దానం చేయాలనే ఒక చిన్న నిర్ణయం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని, అవయవ మార్పిడి కోసం నిరీక్షిస్తున్న రోగులలో ఆశలు నింపి, వారి కుటుంబాలకు నూతన ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు.
ఒక వ్యక్తి తన జీవిత కాలాన్ని పొడిగించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మరొకరికి ప్రాణదానం చేయడం ద్వారా ఆ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని, సార్థకతను చేకూర్చవచ్చు అని వ్యాఖ్యానించారు. దేశంలో అవయవ దానంపై మరింత చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పౌరులందరూ బాధ్యతాయుతమైన నిశ్చయంతో దాతలుగా మారేందుకు ముందుకు రావాలని పవన్ కోరారు. ప్రతి దానం ఒక ఆశగా మారేలా, ప్రతి దాత ఒక గొప్ప వారసత్వాన్ని విడిచివెళ్లేలా సమాజంలో ఉదార సంస్కృతిని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. జీవితాన్ని దానం చేయండి.. ఆశను పంచండి.. ప్రాణాలను కాపాడండి అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV