
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
ఓల్డ్ సిటీలో మైనారిటీలు కరెంట్ బిల్లులు కట్టరనే ఆరోపణలు ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న 200 యూనిట్ల పథకం వల్ల ఎక్కువగా మైనారిటీలకే లబ్ధి చెందుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఇవాళ పోస్టు చేసిన ఆయన.. 'పాతబస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని తెలంగాణ సీఎం అన్నారు. ఇదే మీ ప్రభుత్వ విధానం అయితే.. నిబంధనలు పాటించలేదనే కారణంతో హైడ్రా (HYDRAA) చర్యలు తీసుకుంటున్నప్పుడు పేద కుటుంబాల విషయంలో ఇదే సానుభూతిని ఎందుకు చూపడం లేదు?' అని ప్రశ్నించారు.
ఒకవైపు సీఎం పేద హిందూ కుటుంబాలపై నిబంధనల ఉల్లంఘన పేరుతో హైడ్రాను ప్రయోగిస్తూ మరోవైపు మైనారిటీల సంక్షేమం పేరుతో విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూకుటుంబాలపై ఆ సానుభూతి ఏదని నిలదీశారు. హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టి మైనారిటీలను బుజ్జగించే రాజకీయాల చేయడంలో ఖిలాఫత్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో మారలేదని దుయ్యబట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..