
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) బస్సు అదుపుతప్పి బోల్తా పడిన
ఘటన హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు హైదరాబాద్ నుంచి తమిళనాడు (Tamilnadu)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలానికి ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు భూత్పూర్ (Bhootpur) సమీపానికి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా వెళ్లి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో ఒక్కసారిగా ప్రయాణికుల కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయాందోళనకరంగా మారింది.
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..
ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన 21 మందిని వెంటనే 108 అంబులెన్సుల్లో మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రి (Mahabubnagar Government Hospital)కి తరలించారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలవ్వగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతానికి బాధితులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అనంతరం భూత్పూర్ పోలీసులు స్పాట్కు చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..