
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) ట్రేడింగ్లో భారీ లాభాల ఆశ చూపి ఛార్టెడ్ అకౌంటెంట్కు సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) టోకరా వేశారు. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేసి మోసం చేశారు. ఈ-మెయిల్, టెలిగ్రాం ద్వారా బాధితుడిని నిందితులు సంప్రదించారు. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ నిపుణులమంటూ మోసగాళ్లు నమ్మించారు.
తమ సలహాలతో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సైబర్ కేటుగాళ్లు ఎరవేశారు. మొదట డౌన్లోడ్ చేయించిన ట్రేడింగ్ యాప్లో రూ. 2 లక్షలను నరసింహారెడ్డి పెట్టుబడి పెట్టారు. రూ. 2 లక్షలకు రూ.5 లక్షలు లాభం వచ్చినట్లుగా యాప్లో చూపించారు. మరో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టించగా.. రూ. 9.5 లక్షలను నిందితులు లాభం చూపించారు. ఈ యాప్లో కృత్రిమ లాభాలు చూపిస్తూ బాధితుడిలో నమ్మకం పెంచారు. భారీగా పెట్టుబడి పెడితే అంతే ఎక్కువగా లాభాలు వస్తాయంటూ నిందితులు మభ్యపెట్టారు.
కేవలం 12 రోజుల్లో 52 విడతల్లో రూ.2.45 కోట్లను మోసగాళ్లు పెట్టుబడి పెట్టించారు. డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించగా బాధితుడు విఫలమయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఫోన్లు, ఆన్లైన్ కాంటాక్ట్కు నిందితులు స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను బాధితుడు నరసింహారెడ్డి ఆశ్రయించాడు. నరసింహారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్