
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ
సాగునీటి రంగంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో కాళేశ్వరం ప్రాధాన్యతను గానీ, చరిత్రను గానీ మార్చలేరని స్పష్టం చేశారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కాళేశ్వరం లేకపోతే మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులు కాళేశ్వరం వ్యవస్థలో అంతర్భాగమనే వాస్తవాన్ని ఎంత దాచాలని చూసినా సాధ్యం కాదని అన్నారు. కేసీఆర్ హయాంలో ఎల్లంపల్లి, దేవాదుల, మిస్మానేరు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని గుర్తుచేశారు. కాళేశ్వరం ద్వారానే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్నది పచ్చి నిజమని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి రంగాలపై చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన వల్ల రాష్ట్రంలో గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం తక్షణమే ఆపాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఎజెండా నుంచి తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ అంశాలను తొలగించకుండా ఈనెల 18న జరిగే GRMB సమావేశానికి హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు వేలాది మంది రైతులతో, శ్రేణులతో కలిసి జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..