
వరంగల్, 14 ఆగస్టు (హి.స.)
చిల్పూర్, స్టేషన్ ఘనపూర్ మండలాల పరిధిలోని మల్లన్న గండి రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంట కాలువలకు నీటి పారుదల శాఖ అధికారులు, రెండు మండలాల ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ లోని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించారు. స్వయంగా కుడి కాలువ గేట్లు లేపి నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని గా మారిందని తెలిపారు. ధర్మసాగర్, ఘనపూర్, మల్లన్న గండి, అశ్వారావు పల్లి, నవాబ్ పేట తో పాటు బొమ్మకూరు, చిటకోడూరు రిజర్వాయర్ ద్వారా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు సాధ్యమైనంత వరకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు నుంచి కూడా సాగు నీరు విడుదల చేయడం లేదని కేవలం దేవాదుల ప్రాజెక్టు నుంచి మాత్రమే పంటలకు సాగు నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల నుంచి ప్రతి రోజు దేవాదుల మోటార్ల ద్వారా పంపింగ్ పరిశీలిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజర్వాయర్లలో నీటిని నింపడం వల్లే ప్రస్తుతం సాగు నీటి విడుదల సాధ్యం అయిందని అన్నారు. రిజర్వాయర్లలో 50 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయని కావున ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగు నీటి విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 15రోజుల పాటు నీటి విడుదల చేసి మరో 15రోజులు రిజర్వాయర్లలో నీటిని నింపడం జరుగుతుందని వెల్లడించారు. పంట కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు పొదుపుగా వాడుకొని పంటలను కాపాడుకోవాలని సూచించారు.
ఆరుతడి పంటలు, ఇప్పటికే నాట్లు పూర్తి చేసి సాగు చేసుకున్న వరి పొలాలకు మాత్రమే నీటి వినియోగించుకోవాలని కొత్తగా వరి నాట్లు వేసి ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి చేశారు. కాలువల ద్వారా వచ్చే నీటిని నిరూపయోగం కాకుండా ప్రజా ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు సమన్వయం చేసుకుని కాలువల వెంట పర్యవేక్షించాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించి పంటలను కాపాడటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..