
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే రాబడి ప్రభుత్వానికి గణనీయంగా పెరిగింది. 2025తో పోలిస్తే 2026లో ఏడు నెలల్లో ప్రతి నెలా ఆదాయం పెరుగుతూ వచ్చింది. అమ్మకాలు, కొనుగోళ్లలో ఏ మాత్రం తగ్గుదల లేదని ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయమే స్పష్టం చేస్తున్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు నెలల్లో ఏకంగా రూ. 1,408 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. సాగు భూములు, వ్యవసాయేతర స్థలాలు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఏడాది ఏడు నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 10,114 కోట్ల ఆదాయం వచ్చింది.
కాగా 2025లో ఇదే సమయంలో రూ.8,706 కోట్ల రాబడి రాగా, ఈ సారి స్పష్టమైన పెరుగుదల నమోదైంది. ప్రభుత్వ భూముల సవరణ ముందే ప్రకటించడంతో మే నెలలో రూ.300 కోట్ల రాబడి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్, జులై నెలల్లోనూ అదే ఊపు కొనసాగింది. భూముల విక్రయాలు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం మందగించిందని జరుగుతున్న విషప్రచారంలో వాస్తవం లేదని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం భూముల రేట్లు పెంచినప్పటికీ రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని స్పష్టమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు