
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
తెలంగాణ ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ ఈ నెల 10వ తేదీన ముగిసింది. దీంతో హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఓటర్ల లెక్క తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లాలో గణనీయంగా ఓట్ల సంఖ్య తగ్గింది. జిల్లాలో సర్కు ముందు మొత్తం ఓటర్లు 47,35,315 మంది ఓటర్లు ఉండగా. 58.89 శాతంతో తాజాగా 27,76,624 డిజిటలైజ్ అయ్యాయి. 19.5 లక్షల మంది ఓటర్ల వివరాలు లభ్యం కాలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 41.11 శాతం ఓట్లు తగ్గాయి. తొలగింపు ముప్పులో (అన్-కలెక్టబుల్) ఓట్లు 19,41,000 ఉన్నాయి. ప్రస్తుతం తగ్గినట్లు చూపిస్తున్న ఓట్లు శాశ్వతంగా తొలగించబడవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు ఓటర్లకు క్లెయిమ్లు, అభ్యంతరాల కాలపరిమితిని ఎన్నికల సంఘం కేటాయించింది.
ఒకవేళ ముసాయిదా జా బితాలో పేరు లేకపోతే, ప్రజలు వెం టనే ఫారమ్-6 నింపి ఆన్లైన్ ద్వారా లేదా బీఎల్వోల ద్వారా తిరిగి తమ ఓటు హక్కును ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఓటు వివరాలను పరిశీలించుకోవడానికి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ తెలంగాణ అధికారిక పోర్ట ల్ను సందర్శించవచ్చు. నగరంలో ఐటీ ఉద్యోగులు, ఇళ్లు మారిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, గ్రామాలు, నగరంలో రెండు చోట్ల ఓట్లున్న వారు ఇక్కడ సర్ ఫారాలు ఇవ్వకపోవడం తదితర కారణాలతో సనత్ నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా, అంబర్ పేట నియోజకవర్గంలో అత్యల్పంగా ఓట్లు తగ్గాయి. సనత్ నగర్ సెగ్మెంట్ లో జిల్లాలోనే అత్యధికంగా 45.68 శాతంతో సుమారు 1.16 లక్షల ఓట్లు తగ్గే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ కేవలం 53.52 శాతం మాత్రమే పూర్తయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 88,933 ఓటర్ల వివరాలు లభ్యం కాలేదు. ఈ ఓట్లన్నీ ఆబ్సెంట్/షిఫ్టెడ్, డెడ్ (ఏఎస్ డీ) జాబితాలోకి వెళ్లాయి. ముషీరాబాద్లో దాదాపు 46 శాతం అంటే 58,320 మంది ఓటర్ల ఆచూకీ క్షేత్రస్థాయిలో లభించలేదు.
మలక్ పేట్ నియోజకవర్గంలోనూ 46 శాతం ఓటర్ల వివరాలు లభ్యం కాకపోవడం గమనార్హం. జిల్లాలో అత్యల్పంగా ఓట్లు తగ్గిన సెగ్మెంట్ గా అంబర్ పేట్ నిలిచింది. జిల్లాలో తగ్గిన ఓట్ల శాతం సగటు 41 కాగా.. ఇక్కడ కేవలం 14.98 శాతం ఉంది. అంబర్ పేట్ నియోజకగర్గంలో 85 శాతం ఓటర్లు విజయవంతంగా సర్ ప్రక్రియ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. ఇదిలా ఉండగా ఈ నెల 17న విడుదలయ్యే అధికారిక ముసాయిదా జాబితాలో ప్రతీ పోలింగ్ బూత్ వారీగా ఖచ్చితమైన సంఖ్య తెలిసే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..