సూపర్ ఫాస్ట్’ రైళ్లు.. ప్యాసింజర్ ప్రయాణం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
Train


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గుంటూరు నుంచి నగరానికి వచ్చే పల్నాడు ఎక్స్ప్రెస్ రోజూ గంటకు పైగా ఆలస్యం అవుతుండగా, విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ ముప్పావుగంట ఆలస్యంగా నడుస్తోందని చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సకాలంలో గమ్యానికి చేరుకోలేకపోతున్నారని, వారి విలువైన సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు నుంచి బుధవారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరిన పల్నాడు ఎక్స్ప్రెస్ బేగంపేట్కు 10.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, గంటకు పైగా ఆలస్యంతో 11.40 గంటలకు వచ్చింది. అలాగే, విశాఖపట్నం నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ బేగంపేట్కు సాయంత్రం 6.30 గంటలకు రావాల్సి ఉండగా, 50 నిమిషాల ఆలస్యంగా రాత్రి 7.20 గంటలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే అతి ముఖ్యమైన పల్నాడు, జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రతిరోజు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికుల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

గుంటూరు నుంచి బీబీనగర్ వరకు సింగిల్లైన్ కావడం, డబ్లింగ్ పనులు జరుగుతుండడం సూపర్ఫాస్ట్ రైళ్ల ఆలస్యానికి కారణాలుగా రైల్వే సిబ్బంది చెబుతున్నారు. సికింద్రాబాద్- వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఐదు స్టేషన్ల ముందే క్లియరెన్స్ ఇవ్వాల్సి రావడంతో తరచుగా సూపర్ఫాస్ట్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రయాణికుల సంఘాలు అంటున్నాయి. రైళ్ల నిర్వహణపై పర్యవేక్షణను మరింతగా పెంచాలని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు ఆయా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande