సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వానికి బిగ్ విక్టరీ.. కరూర్ బాధితుల ఉద్యోగాలకు లైన్ క్లియర్
సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వానికి బిగ్ విక్టరీ.. కరూర్ బాధితుల ఉద్యోగాలకు లైన్ క్లియర్
Supreme court


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)

తమిళనాడులోని విజయ్ (Vijay)

ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. కరూర్ రోడ్డు షోలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేయగా.. ఆ ఉత్తర్వులపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబ సభ్యులకు విజయ్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది. ఈ క్రమంలోనే ముందస్తు ఎంపిక విధానం లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లకు విరుద్ధమంటూ దాఖలైన పిల్ (PIL) ఆధారంగా మద్రాస్ హైకోర్టు ఆ ఉద్యోగాల మంజూరు ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్డీవాలా (Justice JB Pardiwala), జస్టిస్ కె వినోద్ చంద్రన్(Justice K. Vinod Chandran)లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను విచారించి, హైకోర్టు రద్దు ఉత్తర్వులపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'అదో పెద్ద దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటన. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. దురదృష్టకర సంఘటనల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోతే వారికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదా..? ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడానికి మీరెవరు' అని పిటిషనర్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన తాజాగా స్టే ఉత్తర్వులతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కే మార్గం సుగమమైంది. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande