
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
రాజమండ్రి నగర పరిధిలో జరిగిన ఒక ఘోర రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత ఏడు రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాలతో పోరాడి నిన్న రాత్రి కన్నుమూసిన మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన యువ వైద్యురాలు ఇలా అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు.
ఆమె మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. బాధాతప్త హృదయంతో ఉన్న ఆమె తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. వైద్య సమాజం కూడా ప్రియాంక మృతికి నివాళులర్పించింది.
ఇలాంటి ఘోర రహదారి ప్రమాదాలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం రహదారి భద్రతా నియమాలను కఠినతరం చేయాలని, ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. అలాగే, ప్రాణాలు కోల్పోయిన మెడికల్ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా మరియు సామాజికంగా అండగా నిలవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi