
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
99శాతం ప్రభుత్వ ఉద్యోగాలను
అమ్ముకుంటున్నారని యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పతంజలి యోగపీఠంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జార్ఖండ్ విద్యార్థుల నిరసనల గురించి మాట్లాడుతూ.. పేపర్ లీక్తో విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, వ్యవస్థలో మార్పు రాకపోతే తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరసనలు, గందరగోళం విద్య మరియు ఉపాధి వ్యవస్థల్లో తీవ్రమైన సమస్యలను సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలలు, కాలేజీల్లో ఇప్పటికీ ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం వల్లనే విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారని చెప్పారు.
ఉపాధ్యాయులు, పుస్తకాలు, విద్యుత్, నీరు, మరుగుదొడ్ల కోరతను ఆయన ఎత్తిచూపారు. ప్రభుత్వ నియామకాల్లో ఇంటర్వ్యూల్లో 90శాతం అవినీతి జరుగుతోందని చెప్పారు. కులం, వర్గం, సమాజిక సమూహం లేదా భావజాలం ఆధారంగా కొన్నిసార్లు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అర్హులైనవారిని పక్కకు నెట్టేస్తున్నారని అన్నారు. ప్రజాగ్రహం, మరిన్ని నిరసనలకు దారితీయక ముందే వ్యవస్థను సరిదిద్దాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇంకా సమయం ఉందని, వ్యవస్థను సంస్కరించాలని సూచించారు. లేదంటే దేశంలో మరిన్ని ఉద్యమాలు జరగవచ్చని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..