పత్తి.. బంగారమే
రైతులు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి పెరుగుతున్న దేశీయ వినియోగం ఎగుమతుల్లోనూ వృద్ధ - కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ లలిత్కుమార్ గుప్తా
Lalith kumar gupta


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) భారత్లో పత్తి... బంగారంగా మారుతోందని, దేశీయ వినియోగం పెరగడంతో పాటు ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్కుమార్ గుప్తా చెప్పారు. ఎల్నినో నుంచి పత్తి బయటపడిందని అన్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆయన పలు అంశాలను వెల్లడించారు.

గత ఏడాది కంటే ఈ వానాకాలం సీజన్లో పత్తి విస్తీర్ణం ఎలా ఉండబోతోంది?

ఎల్నినో ప్రభావం వల్ల మొదట్లో వర్షాలు ఆలస్యమయినా రైతులు పత్తి పంటను పూర్తిస్థాయిలో వేశారు. ఆ తర్వాత దేశం అంతటా వర్షాలు పడ్డాయి. ఇప్పటి వరకు పంట బాగుంది. ఈ నెల 15, సెప్టెంబరు 1 తర్వాత మరో రెండు, మూడు భారీ వర్షాలు పడితే పంట చాలా బాగా వస్తుంది. గత ఏడాది కంటే విస్తీర్ణం పెరుగుతుంది.

ధరలపై మీ అంచనాలు ఏమిటి?

గత సంవత్సరంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. పత్తి గింజల ఉప ఉత్పత్తుల ధర 25 శాతం పెరిగింది. ఈ సీజన్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. సాగు ఖర్చులు, ఇతర అంశాల శాస్త్రీయ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను గత ఏడాది కంటే క్వింటాలుకు రూ.557 పెంచింది. పొడవాటి దూది పింజకు రూ.8,667, మధ్యస్థ దూది పింజకు రూ.8,267 చేసింది. నిర్ణీత ప్రమాణాలు పాటిస్తే గరిష్ఠ ధరను పొందవచ్చు.

దేశంలో విస్తీర్ణం పెరిగినా ఉత్పాదకత తగ్గుతోందని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది..ఈ పరిస్థితుల్ని ఎలా చూడాలి?

ఈ సమస్య దేశంలో చాలా ఏళ్లుగా ఉంది. చిన్న భూకమతాలు, నేల ఆరోగ్యం, వాతావరణ మార్పు వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చైనా, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే సగటు ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో రూ.5,600 కోట్లకు పైగా వ్యయంతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీని ఇటీవలే ప్రారంభించింది. ప్రస్తుతం హెక్టార్కు 450 కిలోల ఉత్పాదకత ఉండగా... వచ్చే 2030-31 నాటికి 755 కిలోలకు పెంచడమే దాని లక్ష్యం. ఈ మిషన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి.

వచ్చే సీజన్లో కొనుగోళ్ల ప్రణాళికలేమిటి?

కొత్తగా సంస్కరణలేమైనా ఉన్నాయా?

కొనుగోలు కేంద్రాలను విస్తరిస్తాం. ఆరు వందలకు పెంచుతాం. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రికార్డులన్నీ డిజిటలీకరిస్తున్నాం. కిసాన్ కపాస్ యాప్ సేవలను సరళీకరిస్తున్నాం. కొన్న వెంటనే రైతుల ఖాతాల్లో చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిన్నింగ్, ప్రెస్సింగ్ నిబంధనలను కఠినం చేశాం. దేశవ్యాప్తంగా 1,650 మిల్లులను ఎంపిక చేస్తున్నాం. తెలంగాణ ప్రాధాన్యం దృష్ట్యా కొనుగోలు కేంద్రాలను 131కి, జిన్నింగ్ మిల్లులను 356కి పెంచాం.

పత్తి రంగం భవిష్యత్ ఎలా ఉంటుంది?

దేశీయ పత్తి రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంది. కేవలం వస్త్రాలకే గాక ఇతర అనుబంధ ఉత్పత్తులకు విస్తరిస్తోంది. ఎగుమతులు పెరుగుతున్నాయి. పలు దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోంది. 2030 నాటికి టెక్స్టైల్స్లో ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో దేశంలో పత్తి వినియోగం 300 లక్షల బేళ్ల నుంచి 348 లక్షల బేళ్లకు చేరుకుంది. ఇదే సమయంలో భారత్ నుంచి పత్తి ఆధారిత టెక్స్టైల్స్ ఎగుమతులు రూ.3,09,573 కోట్ల నుంచి రూ.3,25,339 కోట్లకు చేరాయి.

పంటల సాగులో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనశుద్ధి అనంతరం సాగు చేపట్టాలి. సరైన పద్ధతిలో కోతలు జరపాలి. సాగు ప్రారంభం నుంచే నాణ్యతపై దృష్టి సారించాలి. కొనుగోళ్లలో తేమ శాతం కీలకం. దానిని పరిగణనలోనికి తీసుకొని కొనుగోళ్లకు సన్నద్ధం కావాలి. అప్పుడు సీసీఐగానీ, వ్యాపారుల నుంచి గానీ అత్యుత్తమ ధరలు లభిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande