
అమరావతి, 15 ఆగస్టు (హి.స.)
కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు. శనివారం విజయవాడలో డీఎస్సీ-2025 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులు మాట్లాడారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తామంతా తిప్పి కొట్టాలని నిర్ణయించినట్లు వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం విజయవాడలో ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10.30 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు.
అనంతరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ చేయనున్నట్లు వివరించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. ఈ ర్యాలీలో సుమారు 7 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొనున్నారని సమాచారం. గత వారం డీఎస్సీ-2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో డీఎస్సీ 2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
2025లో కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో భారీగా అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయంటూ వైసీపీ నేతలు ప్రచారానికి తెగబడ్డారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. అయినా వైసీపీ నేతలు మాత్రం ఆరోపణలను ఆపడం లేదు. దీంతో వైసీపీ నేతల విమర్శలను ఈ డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారే తిప్పికొడుతున్నారు. అందుకోసం వారు స్వయంగా రంగంలోకి దిగి.. వైసీపీ నేతలకు క్లారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడలో వీరంతా ర్యాలీ చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ