దేశం బాగుపడాలంటే మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి.. కేటీఆర్
దేశం బాగుపడాలంటే మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి.. కేటీఆర్
Ktr


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స)

డబుల్ ఇంజిన్ అని కేంద్ర పాలకులు డబ్బా కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సింగిల్ ఇంజిన్ మోత మోగించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కన్నా మెరుగ్గా పనిచేసిన డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉందా అని అడిగారు. దేశంలోని 28 ఇంజిన్లు పోటీపడి ఉరికితే బాగుపడమా అని ప్రశ్నించారు.

హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రోకు కేంద్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడ మాత్రం మెట్రోలు ఇస్తున్నారని తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఎక్కడుందని అడిగారు. మీతో అంటకాగని రాష్ట్రాలపై కక్షగట్టడమేనా మీ వికాసం అని ప్రశ్నించారు. మనకన్నా చిన్న దేశాలు ఎక్కడికో దూసుకెళ్లాయని చెప్పారు. మనం మాత్రం కులమతాల కొట్లాటల్లోనే ఉన్నామని అన్నారు. ఎన్నికలు రాగానే దేవుళ్ల పేర్లు చెప్పడం, అక్షింతలు పంచడం చేస్తున్నారని విమర్శించారు. పక్కా మళ్లీ తెలంగాణ పట్టాలు ఎక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశం బాగుపడాలంటే మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని కేటీఆర్ అన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర పెద్దది అని కేటీఆర్ తెలిపారు. జీడీపీలో 5.2 శాతం వాటా మన తెలంగాణదే అని పేర్కొన్నారు. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పారు. ఇవాళ ఉన్న సన్నాసులకు తెలివి లేదు అని విమర్శించారు. దివాళా తీసిందని కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మళ్లీ పట్టాలెక్కాలంటే సమర్థ నాయకుడు రావాలన్నారు. ప్రజలందరూ ప్రేమించే నాయకుడు కేసీఆర్ అని అన్నారు.జై తెలంగాణ అని అనని వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి

ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. అలాంటోడికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు. పదేండ్లు కేసీఆర్ పాలనను ప్రజలు చూశారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనను చూసి.. కేసీఆర్ పాలన కావాలని తండ్లాడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఉంటే అన్ని పథకాలు వచ్చేవని జనం అంటున్నారని చెప్పారు. ఓటేసే ముందు ఆలోచించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయని అన్నారు.

కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇవాళ ఉన్న కల్యాణ లక్ష్మీని కూడా ఊడగొట్టిండు అని మండిపడ్డారు. కేసీఆర్ 15 లక్షల మంది ఆడబిడ్డల పెండ్లి చేసిండు అని కేటీఆర్ తెలిపారు. బాల్యా వివాహాలకు అడ్డుకట్టు వేయడానికి కల్యాణలక్ష్మీ పథకం తెచ్చిండు అని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా కల్యాణలక్ష్మీ పథకం తీసుకొచ్చిండని అన్నారు. ఉద్యమ సమయంలో ఒక గిరిజన కుటుంబం వలపోత చూసి.. కేసీఆర్ కల్యాణ లక్ష్మీ పథకానికి రూపకల్పన చేసిండు అని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం గొప్ప పథకాన్ని తీసుకొచ్చిండు అని కొనియాడారు. నాయకుడికి మనసుంటే గొప్ప పథకాలు పుట్టుకొస్తాయని కేటీఆర్ అన్నారు. కంటి వెలుగు పథకం కింద 4 కోట్ల మందికి కేసీఆర్ స్క్రీనింగ్ చేయించిండు అని తెలిపారు. నాయకుడికి మనసుంటే కరెంటు వస్తదని అన్నారు. తెలంగాణ వచ్చినంక ఆరు నెలలకే 24 గంటల కరెంటు తెచ్చిండు అని తెలిపారు. పదేండ్లలోనే కేసీఆర్ అద్భుతాలు చేసిండు అని పేర్కొన్నారు. 60 ఏండ్లు ఈ పాలకులు దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. దేశం పోవాల్సిన పద్ధతుల్లో ముందుకు పోలేదని చెప్పారు. దేశం కోసం ఆనాడు కేసీఆర్ అడుగు ముందుకేసిండు అని తెలిపారు. నా దేశం ఎలా బాగుపడాలి అన్న సంకల్పంతో పనిచేయాలని సూచించారు.

18 గంటలు పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నాడని కేటీఆర్ అన్నారు. తమ్ముళ్లకు భూములు ఎట్లా దోచిపెట్టాలని పనిచేస్తున్నావా అని ప్రశ్నించారు. అంబానీ కన్నా గొప్పగా నీకుటుంబాన్ని తయారు చేసుకుంటావా అని అడిగారు. మోసపోతే గోసపడతారని కేసీఆర్ అనాడే చెప్పారని తెలిపారు. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. యూరియా కావాలంటే లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande