
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సొంత పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్ ముందుకు రావడం ఆసక్తిగా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనని, కోమటిరెడ్డి వ్యాఖ్యలతో తాను పూర్తిగా నేను ఏకీభవిస్తున్నానని కేటీఆర్ అన్నారు. పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5-6 లక్షలు ఇవ్వడానికి 500 నిబంధనలు పెట్టారని విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ను రాహుల్ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారని తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారన్నారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ చెబుతున్నారని మరి అలాంటప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడి చేసినా ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేవన్నారు. ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవంపై దాడి జరిగితే యువత తిరగబడుతుందని.. ధైర్యంగా నిలబడిన NALSAR యువతకు సెల్యూట్ అన్నారు. విద్యార్థులు - న్యాయవ్యవస్థ మధ్య సంబంధాన్ని గుర్తించిన CJI జస్టిస్ సూర్యకాంత్కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..