బీజేపీ-ఆర్ఎస్ఎస్ విధానాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుంది.. మల్లికార్జున ఖర్గే
బీజేపీ-ఆర్ఎస్ఎస్ విధానాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుంది.. మల్లికార్జున ఖర్గే
Kharge


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

ఆధునిక, ప్రజాస్వామిక, లౌకిక

భారతదేశ నిర్మాణానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రస్తుత దేశాభివృద్ధిలో 90 శాతం కాంగ్రెస్ పార్టీ కృషియే ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) స్పష్టం చేశారు. నెహ్రూ

ఐఐటీలు, ఐఐఎంలు, పీఎస్యూలను స్థాపించి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారని, లాల్ బహదూర్ శాస్త్రి హరిత, శ్వేత విప్లవాలకు బాటలు వేశారని, ఇందిరా గాంధీ సైనిక పాటవాన్ని పెంచి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు సిక్కింను భారత్లో విలీనం చేశారని గుర్తుచేశారు. ఇంత చేసినా కాంగ్రెస్ నేతలకు ఎన్నడూ అహంకారం లేదని, కానీ ప్రస్తుత పాలకులు కేవలం పేర్లు మారుస్తూ తామే అంతా చేశామంటూ ఎర్రకోట వేదికగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఘనతను దక్కించుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలు, వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రధానమంత్రి, హోంమంత్రి సభకు హాజరు కాకుండా ఛాంబర్లో కూర్చున్నారని ఖర్గే మండిపడ్డారు. ప్రజలు తమ సమస్యలపై గళమెత్తేందుకు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే, ఇంట్లో లేదా గదుల్లో కూర్చోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. నేడు దేశంలో యువత కలలు కల్లలవుతున్నాయని, తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్న యువతను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి నేటి వరకు హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెడుతూ పేదలను అణచివేస్తున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ విధానాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande