
నల్గొండ, 15 ఆగస్టు (హి.స.)
నల్లగొండ జిల్లాను అభివృద్ధిలో తెలంగాణకు ఆదర్శంగా నిలబెట్టడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, దేశాభివృద్ధికి నిజాయితీగా పనిచేయడమే స్వాతంత్ర్య స్ఫూర్తి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ పోషించిన పాత్రను గుర్తుచేస్తూ.. ఈ గడ్డ పోరాటం, త్యాగం, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
“నల్లగొండ నా ఊపిరి. నా శ్వాస ఉన్నంత వరకు ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం పని చేస్తా. జిల్లాలో నీటి కష్టాలు తీర్చి అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతా” అని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, సన్నబియ్యం, ఆరోగ్యం, విద్య, రహదారులు, తాగునీటి రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 5.35 లక్షల మంది రైతులకు రూ.715 కోట్ల రైతు భరోసా, 1.99 లక్షల మందికి రూ.51.28 కోట్ల పింఛన్లు అందుతున్నాయని వివరించారు. 17,873 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 4,360 పూర్తయ్యాయని చెప్పారు. 2.56 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా జీరో విద్యుత్ బిల్లులు అందుతున్నాయన్నారు. నల్లగొండ పట్టణానికి 24 గంటల తాగునీటి లక్ష్యంతో రూ.83 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు మరో రూ.300 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. యువత కోసం రూ.20 కోట్లతో ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అమరవీరుల త్యాగాల సాక్షిగా నల్లగొండను అన్ని రంగాల్లో ముందంజలో నిలబెడతానని మంత్రి హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు