హన్మకొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
హన్మకొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
Minister


హనుమకొండ, 15 ఆగస్టు (హి.స.)

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తుందన్నారు. హన్మకొండ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, మత్స్య, గృహ నిర్మాణ, విద్య, జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను శకటాలు, ప్రదర్శనల ద్వారా వివరించాయి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande