
ములుగు, 15 ఆగస్టు (హి.స.)
ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగంతోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని, మహానుభావుల త్యాగాలను ఎన్నటికీ మరువద్దని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడం జరుగుతుందని వివరించారు. శనివారం 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని తంగేడి మైదానంలో కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈనెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా మేడారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆహార భద్రతను మరింత పటిష్టం చేయడానికి క్యూఆర్ కోడ్ నూతన రేషన్ కార్డులు, చేయూత పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు.
ములుగు జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించి 147 కోట్ల 61 లక్షల రూపాయలను ఆదా చేసుకున్నారని, జిల్లా వ్యాప్తంగా 5 వందల రూపాయలకే 3,17, 469 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశామని వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు అర్హత కలిగిన 46వేల 357 విద్యుత్ మీటర్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని, మెరుగైన విద్యుత్ అందించడానికి జిల్లాకు 35 నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు కాగా 41 కోట్ల 88 లక్షల రూపాయలతో 12 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని అన్నారు. గుడిసె లేని తెలంగాణ తీర్చిదిద్దడానికి రాష్ట్ర
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టి ములుగు నియోజకవర్గంలో 5 వేల 194 ఒక వెయ్యి 636 గృహాలను నిర్మించి గృహప్రవేశాలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ములుగు, ఏటూర్ నాగారం కేంద్రాల్లోని ప్రధాన ఆస్పత్రులలో కోట్లాది రూపాయలతో నూతన పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
నూతన పరిజ్ఞానంతో విద్య బోధన చేయడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామని, విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాల లోని మహిళలకు 9 కోట్ల 7 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని, నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా 22 కోట్ల 26 లక్షల రూపాయల నిధులను జమ చేశామని అన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఏటూరునాగారం లో ఐటీడీఏ ద్వారా గిరిజనులకు వివిధ సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతుందని, నూతనంగా ఏర్పాటైన ములుగు మున్సిపాలిటీ 15 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని సీతక్క తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు