
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వివాదం మరో మలుపు తిరిగింది. 2026 నల్సార్ బ్యాచ్ విద్యార్థులు ఎవరినీ లాయర్లుగా నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆదేశించి ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్న వ్యవహారంపై నల్సార్ 'స్టూడెంట్ బార్ కౌన్సిల్' తీవ్రంగా ఖండించింది. బీసీఐ చైర్మన్ మన్హర్ కుమార్ మిశ్రా విద్యార్థులు, అధ్యాపకులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకుగాను వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని విద్యార్థి ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు లేదా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)తో సహా ఏ సంస్థా విమర్శలకు అతీతం కాదని నాల్సార్ (NALSAR) న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం స్పష్టం చేసింది.
కాగా విశ్వవిద్యాలయంలో ప్రతియేటా జరిగే కాన్వకేషన్ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరుకావడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ నాల్సార్లోని 1,400 మంది విద్యార్థుల్లో దాదాపు 450 మందికి పైగా విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీఐ (BCI) తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నాల్సార్ విశ్వవిద్యాలయానికి చెందిన 2026 గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా (Advocates) నమోదు చేయవద్దని గురువారం రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో చైర్మన్ మిశ్రా ఆ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకున్నారు. బీసీఐ నిర్ణయంపై సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ సైతం శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది విద్యార్థులతో తనకు జరుగుతున్న సంవాదం అని ఇందులో జోక్యం చేసుకోవడానికి బీసీఐ ఎవరు అంటూ నిలదీశారు. ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందని అంతా భవించగా బీసీఐ తమకు క్షమాపణలు చెప్పాలని నల్సార్ స్టూడెంట్ బాడీ డిమాండ్ చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు